: అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు... పాక్ క్రికెటర్లపై బోర్డుకు బౌలింగ్ కోచ్ ఫిర్యాదు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వివాదాలకు కేంద్ర బిందువు. ప్రత్యర్థి జట్టు సభ్యులపై దురుసుగా ప్రవర్తించడంలో వారు ఆసీస్ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోరు. ఇక తమకు పాఠాలు నేర్పేందుకు వస్తున్న కోచ్ లపైనా వారు విరుచుకుపడుతున్న వైనం తాజాగా వెలుగు చేసింది. పాక్ బౌలింగ్ కోచ్ గ్రాంట్ లూడెన్ ను పాక్ క్రికెటర్లు అసభ్యపదజాలంతో దూషించారు. అంతేకాక ప్రాక్టీస్ సెషన్ లో ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. నిన్నటి ప్రాక్టీస్ సందర్బంగా షాహిద్ అఫ్రిదీతో పాటు అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్ లు లూడెన్ ను అసభ్య పదజాలంతో తిట్టిపోశారట. దీంతో మనసునొచ్చుకున్న లూడెన్ వెనువెంటనే పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యాన్ ఖాన్ కు ఫిర్యాదు చేశారు. ఆటగాళ్లను నియంత్రించకుంటే తాను తప్పుకుంటానంటూ లూడెన్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్ సిరీస్ లో పాక్ క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.