: పూరీ జగన్నాథ్ భార్యతో దురుసు ప్రవర్తన... పాల్వంచ ఎస్ఐపై బదిలీ వేటు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సతీమణి లావణ్య పట్ల దురుసుగా ప్రవర్తించిన ఖమ్మం జిల్లా పాల్వంచ ఎస్ఐ షణ్ముగాచారిపై బదిలీ వేటు పడింది. పాల్వంచ పీఎస్ నుంచి బదిలీ చేసిన ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. వివరాల్లోకెళితే... పూరీ కుమారుడు హీరోగా నటిస్తున్న ఓ సినిమా కోసం లావణ్య పాల్వంచకు వచ్చారు. చిత్ర యూనిట్ తో కలిసి ఓ హోటల్ లో బస చేశారు. ఈ క్రమంలో రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా షణ్ముగాచారి ఈ నెల 11న హోటల్ లోని అన్ని గదులను తనిఖీ చేస్తూ, లావణ్య ఉంటున్న రూంను కూడా పరిశీలించారు. ఆ సమయంలో లావణ్యతో పాటు గదిలో చిత్ర హీరోయిన్, ఇతర జూనియర్ నటులున్నారు. ఐడీ కార్డులు చూపాలని కటువుగా మాట్లాడటంతో పాటు గదిలోని బాత్ రూంను కూడా షణ్ముగాచారి తనిఖీ చేశారు. దీంతో ఇబ్బంది పడ్డ లావణ్య రెండు రోజుల తర్వాత అక్కడికి వెళ్లిన పూరీకి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పూరీ... డీజీపీ, కొత్తగూడెం డీఎస్పీకి ఫోన్ లో ఫిర్యాదు చేశారు. పూరీ జగన్నాథ్ ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు షణ్ముగాచారి, లావణ్య పట్ల దురుసుగా ప్రవర్తించారని నిర్ధారించారు. దీంతో ఆయనను అక్కడి నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.