: పక్కపక్కన్నే అసీనులైన కేజ్రీవాల్, కిరణ్ బేడీ... సెల్ఫీల కోసం పోటీ పడ్డ ప్రముఖులు
గతంలో అన్నా హజారే సమక్షంలో ఒకే వేదికపై కనిపించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత కిరణ్ బేడీలు ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహా శివరాత్రి సందర్భంగా ఒకే వేదిక మీద కనిపించారు. దీంతో వారిద్దరినీ సెల్ఫీల్లో బంధించేందుకు పలువురు ప్రముఖులు స్మార్ట్ ఫోన్లతో పోటీలు పడ్డారు. అసలు విషయమేంటంటే, ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన కేజ్రీవాల్, కిరణ్ బేడీలు విధాన నిర్ణయాలతో పాటు వ్యక్తిగత విమర్శలూ చేసుకున్నారు. బహిరంగ చర్చకు కేజ్రీవాల్ విసిరిన సవాల్ ను కిరణ్ బేడీ తోసిపుచ్చారు. ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్ సీఎం కావడం, కిరణ్ బేడీ ఎమ్మెల్యేగానూ గెలవలేకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసే ప్రసక్తే లేదని దాదాపుగా అంతా అనుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఏర్పాటు చేసిన ‘ఎట్ హోం’లో వారిద్దరూ పాల్గొన్నారు. పక్కపక్కన్నే కూర్చున్నప్పటికీ వారి మధ్య మాట కలవలేదని సమాచారం.