: ఢిల్లీ సచివాలయంలోకి మీడియాకు నో ఎంట్రీ... డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ ను బహిష్కరించిన మీడియా
ప్రజల ఆదరాభిమానాలతో ఢిల్లీ పాలనా పగ్గాలను దక్కించుకున్న అరవింద్ కేజ్రీవాల్ సర్కారు, మీడియా నుంచి ప్రతిఘటనను ఎదుర్కొంది. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ పని ప్రారంభించిన తొలిరోజు సోమవారమే (నిన్న) ఈ వ్యతిరేకత రావడం గమనార్హం. పారదర్శక పాలన అంటూ బీరాలు పలికిన కేజ్రీవాల్, నిన్న సచివాలయంలోకి మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. దీంతో కేజ్రీవాల్ సర్కారు తీరుపై మండిపడ్డ మీడియా ప్రతినిధులు, సాయంత్రం డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ను బహిష్కరించారు. మీడియా ప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు మనీశ్ సిసోడియాతో పాటు సీఎం కేజ్రీవాల్ మీడియా సలహాదారు నాగేంద్ర శర్మ చేసిన యత్నాలు ఫలించలేదట. దీంతో ప్రెస్ మీట్ కోసమొచ్చిన సిసోడియా మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు.