: ఐపీఎల్ లో కోట్లు పలికాడు... ఎవరీ కరియప్ప?
కేసీ కరియప్ప... ఎవరైనా ఇంతకుముందు ఈ పేరు విన్నారా? ఇతనో క్రికెటర్ అన్న విషయం తెలుసా? అంటే, తెలీదనే అత్యధికుల నుంచి జవాబొస్తుంది. అయితే, ఈసారి ఐపీఎల్ పోటీల్లో 20 ఏళ్ల కరియప్పను లైవ్ లో చూడొచ్చు. ఇంతకీ ఇతగాడు ఎవరంటే, ఓ మిస్టరీ స్పిన్నర్. అతడి స్పిన్ నైపుణ్యాన్ని పసిగట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సోమవారం జరిగిన వేలంలో రూ.2.40 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. కుమార సంగక్కర వంటి దిగ్గజమే తాజా వేలంలో ఆదరణకు నోచుకోని నేపథ్యంలో, కరియప్ప కొనుగోలు నిస్సందేహంగా సంచలనమే. కర్ణాటకు చెందిన కరియప్ప ఇటీవల నిర్వహించిన కర్ణాటక ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఇప్పటిదాకా ఫస్ట్ క్లాస్ క్రికెట్ గడప తొక్కని ఆటగాడు ఐపీఎల్ వేలంలో రూ.10 లక్షల ప్రారంభ ధరతో మొదలై కోట్లు కొల్లగొట్టడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తనకు భారీ ధర పలకడంపై కరియప్ప హర్షం వ్యక్తం చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ వీడియో విశ్లేషకుడు శ్రీకాంత్ తనను శిక్షణ శిబిరానికి తీసుకెళ్లాడని, నెట్స్ లో గంభీర్ కు బౌలింగ్ చేశానని చెప్పాడు. అక్కడ బౌలింగ్ సలహాదారు వసీం అక్రం తన బౌలింగ్ ను ప్రశంసించాడని తెలిపాడు. ఆ విధంగా తాను ఐపీఎల్ వేలంలో చోటు చేసుకున్నానని వివరించాడు. తనకు దక్కే డబ్బుతో తల్లిదండ్రులకు ఇల్లు కొనివ్వాలని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు.