: ధోనీ వల్లే మా అబ్బాయికి జట్టులో చోటు దక్కలేదు: యువరాజ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ కు యువీ ఎంపిక కాకపోవడం వెనుక కెప్టెన్ ధోనీ హస్తముందని ఆరోపించారు. ధోనీ ఒత్తిడి కారణంగానే యువీకి సెలక్టర్లు హ్యాండిచ్చారని అన్నారు. ధోనీకి తన కుమారుడితో విభేదాలుంటే అందుకు తానేమీ చేయలేనని, దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. ఇలా దారుణంగా ప్రవర్తించడం కంటే విచారించదగ్గ అంశం మరొకటి ఉండదని ధోనీని ఉద్దేశించి అన్నారు. ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కించుకున్న తర్వాత యువరాజ్ రంజీల్లో విశేషంగా రాణించాడు. వరుస సెంచరీలతో హోరెత్తించాడు. దీంతో, యువీకి వరల్డ్ కప్ బెర్తు ఖాయమని అందరూ భావించినా, అనూహ్యంగా సెలక్టర్లు మొండిచేయి చూపారు. కాగా, తండ్రి వ్యాఖ్యలకు స్పందించి యువీ, అందరిలానే తన తండ్రి కూడా ఆవేదనకు గురయ్యారని... కానీ, ధోనీ నాయకత్వంలో ఆటను ఎంతో ఆస్వాదించానని, భవిష్యత్తులోనూ ఆస్వాదిస్తానని ట్వీట్ చేశాడు.