: విద్యుత్ చార్జీల తగ్గింపుపై హామీలెలా ఇస్తారు?: ఆప్ మేనిఫెస్టోపై మోదీ ఆగ్రహం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నెల 10న వెలుడిన ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాల్లో 67 సీట్లలో విజయం సాధించిన ఆప్, ప్రధానికి భారీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో విజయదుందుభి మోగించిన అరవింద్ కేజ్రీవాల్ పై ప్రత్యక్ష విమర్శలు గుప్పించేందుకు సాహసించని మోదీ, ఆప్ ఎన్నికల మేనిఫెస్టోపై వాగ్బాణాలు సంధించారు. పునరుత్పాదక ఇంధన వనరులపై నిన్న ఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మోదీ ఆప్ హామీలను ప్రశ్నించారు. బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలను సగానికి సగం తగ్గిస్తామని ఎలా ప్రకటిస్తాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాక ఉచిత విద్యుత్ ఇస్తామంటూ పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఇస్తున్న హామీలు కూడా సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.