: చెస్ట్ ఆసుపత్రి తరలింపు రాజ్యాంగ విరుద్ధం కాదన్న హైకోర్టు... టీఎస్ ప్రభుత్వానికి ఊరట
హైకోర్టు నిర్ణయంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊరట లభించగా, బీజేపీ నేత నాగంకు చుక్కెదురైంది. నగర నడిబొడ్డున, ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ ఆసుపత్రిని వికారాబాద్ ప్రాంతానికి తరలించి... ఆ ప్రాంతంలో సచివాలయాన్ని నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వాస్తు పేరు చెప్పి కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకుంటే, చూస్తూ ఊరుకోమని పలు పార్టీలు హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈ క్రమంలో కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దీన్ని విచారించిన హైకోర్టు... ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. చెస్ట్ ఆసుపత్రి తరలింపు చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం కాదని కోర్టు స్పష్టం చేసింది. అంటువ్యాధులకు సంబంధించిన ఆసుపత్రులు నగరం మధ్యలో కాకుండా, శివార్లలో ఉంటేనే మంచిదని అభిప్రాయపడింది. విధాన పరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని తెలిపింది.