: తిరుపతిలో టీడీపీ ఘన విజయం... 1.16 లక్షల ఓట్ల పై చిలుకు మెజారిటీతో సుగుణమ్మ జయకేతనం
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ తరఫున బరిలోకి దిగిన సుగుణమ్మ... తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవిపై 1,16,524 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. టీడీపీ నేత వెంకటరమణ అకాల మరణం నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. పదవిలో ఉండగా మరణించిన నేతల కుటుంబ సభ్యులను ఆ స్థానానికి ఏకగ్రీవంగా పంపాలన్న సంప్రదాయానికి తిలోదకాలిస్తూ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ నామినేషన్ నేపథ్యంలో లోక్ సత్తా, పలువురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలో పోలింగ్ తప్పలేదు. వెంకటరమణ మృతి నేపథ్యంలో ఆయన సతీమణి సుగుణమ్మకే తిరుపతి ప్రజలు పట్టం కట్టారు.