: పెను సంచలనం... పసికూన చేతిలో ఘోర పరాభవం... విండీస్ ను మట్టికరిపించిన ఐర్లాండ్
వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. అంతా పసికూనగా భావించిన ఐర్లాండ్ జట్టు అద్భుతంగా ఆడి వెస్టిండీస్ ను మట్టికరిపించింది. నెల్సన్ లో ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగుల స్కోర్ నమోదు చేసింది. 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆటగాళ్లు మొదటి నుంచే దూకుడు ప్రదర్శించారు. ఓపెనర్ స్టిర్లింగ్ 92, జాయ్ సీ 84, ఓ బ్రియాన్ 79 పరుగులతో రాణించడంతో, మరో 25 బాల్స్ మిగిలి ఉండగానే ఐర్లాండ్ విజయతీరానికి చేరింది. 45.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 307 పరుగులు సాధించిన ఐర్లాండ్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆఖర్లో తడబడి టపటపా వికెట్లు సమర్పించుకున్నా, క్రీజులో కుదురుగా ఉన్న ఓ బ్రియాన్ తన జట్టును గెలిపించాడు. ఓటమి భారాన్ని దిగమింగడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో విండీస్ మిగిలింది. కాగా, గతంలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఐర్లాండ్ జట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్లను ఓడించింది. ఐర్లాండ్ ఒక ఛాంపియన్ జట్టులా ఆడిందని మాజీ క్రికెటర్ అజరుద్దీన్ వ్యాఖ్యానించాడు.