: ఇంట్లోనే కాదు... మైదానంలోనూ పులినే!: పాక్ బౌలర్ కు బ్యాటుతో బదులిచ్చిన కోహ్లీ
‘‘టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... వాళ్ల ఇంట్లోనే పులి. మమ్మల్ని అతడు ఏమాత్రం ఎదుర్కోలేడు’’ అంటూ నెల రోజుల క్రితం పాకిస్థాన్ బౌలర్ సొహైల్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు నిన్నటి అడిలైడ్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఘాటుగానే బదులిచ్చాడు. మాటలతో కాకుండా బ్యాటుతో బదులిచ్చిన కోహ్లీ, సొహైల్ తో పాటు అతడి జట్టుకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. తన బ్యాటింగ్ తో పాక్ బౌలర్లను బెంబేలెత్తించిన కోహ్లీ, సొహైల్ వేసిన 13 బంతుల్లో ఏడు పరుగులు సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సొహైల్, ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వద్దకు దూసుకొచ్చాడు. అయితే కోహ్లీ మాత్రం చిరునవ్వుతోనే అతడికి సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా వారి మధ్య స్వల్ప చర్చ నడిచినా, వారేం మాట్లాడుకున్నారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఈ ఘటన జరిగేటప్పటికే టీమిండియా విజయం ఖాయమైపోయింది.