: 'ఓపెనింగ్' ఎత్తుగడే పాక్ కొంపముంచిందా?


ఎన్నో ఆశలతో అడిలైడ్ ఓవల్ బరిలోకి ఉరికిన పాకిస్థాన్ జట్టుకు అంతిమంగా చేదు ఫలితం తప్పలేదు. చరిత్ర మార్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు చేసి, చివరికి టీమిండియా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి నేపథ్యంలో, పాక్ జట్టు మేనేజ్ మెంట్ తీసుకున్న ఓ తీవ్ర నిర్ణయం జట్టుపై ప్రభావం చూపిందని చెప్పవచ్చు. కెప్టెన్ మిస్బా టాస్ కోల్పోవడంతోనే పాక్ సగం ఓడింది. ఇక, భారీ లక్ష్యఛేదన క్రమంలో మేనేజ్ మెంట్ సీనియర్ బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్ ను ఓపెనర్ గా పంపింది. ఈ ఎత్తుగడ దారుణంగా బెడిసికొట్టింది. భారీ అంచనాల నడుమ క్రీజులోకి వెళ్లిన యూనిస్ కేవలం 6 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో, మిడిలార్డర్లో మిస్బా మినహా ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు అనుభవజ్ఞులు కరవయ్యారు. దీంతో, టీమిండియా బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేయడం పాక్ మిడిలార్డర్ కు శక్తికి మించిన పనైంది. ఓవైపు కెప్టెన్ మిస్బా ఒంటరిపోరాటం చేస్తున్నా, మిగతా బ్యాట్స్ మెన్ రాణించకపోవడంతో పాక్ చతికిలపడిపోయింది. అంతేగాదు, దూకుడుగా ఆడతాడని పేరున్న ఉమర్ అక్మల్ ను ఆరోస్థానంలో బరిలో దింపడం కూడా వ్యూహాత్మకంగా భారీ తప్పిదంగా పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్మల్ రాణించినా, లోయరార్డర్ లో అతనికి మద్దతిచ్చే బ్యాట్స్ మెన్ ఏరీ? ఇక, ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ డకౌట్ కావడంతో పాక్ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం... ఈ మ్యాచ్ లో పాక్ తరపున భారీ భాగస్వామ్యాలు కొరవడ్డాయి. టి20 ఫార్మాట్ ను మినహాయిస్తే, మిగతా ఫార్మాట్లలో భారీ భాగస్వామ్యాలే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాథమిక అంశాన్ని సీరియస్ గా పట్టించుకోని పాక్ ఓటమిరూపంలో తగిన మూల్యం చెల్లించింది.

  • Loading...

More Telugu News