: సంప్రదాయం కొనసాగింది... డబుల్ హ్యాట్రిక్ సొంతమైంది!
వరల్డ్ కప్ చరిత్రలో దాయాది పాకిస్థాన్ పై భారత్ ఎన్నడూ ఓడింది లేదు. ఆ సంప్రదాయానికి కొనసాగింపుగా టీమిండియా నేడు జరిగిన మ్యాచ్ లో 76 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్నందుకుంది. దీంతో, వరల్డ్ కప్ చరిత్రలో పాక్ పై భారత్ గెలుపు రికార్డు 6-0కి చేరింది. మొదటిసారి ఈ రెండు జట్లు 1992 వరల్డ్ కప్ టోర్నీలో తలపడగా, అప్పుడు భారత్ 43 పరుగులతో పాక్ ను చిత్తు చేసింది. ఆపై, 1996లో ఉపఖండం వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో 39 పరుగుల తేడాతో ఓడించారు. 1999 వరల్డ్ కప్ లోనూ విజయం మనవాళ్లదే. ఆ టోర్నీలో పాక్ ను 47 పరుగుల తేడాతో చిత్తు చేశారు. 2003 వరల్డ్ కప్ లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. 6 వికెట్లతో అద్భుత విజయాన్నందుకున్నారు. 2011 వరల్డ్ కప్ లో దాయాదులు సెమీస్ లో తలపడగా, విజయం భారత్ నే వరించింది. 29 పరుగుల తేడాతో టీమిండియా విజయం నమోదు చేసింది.