: కోహ్లీకి రెండు లైఫ్ లు... ఏడడుగులు పొడవున్నా ప్రభావం చూపని మహ్మద్ ఇర్ఫాన్!
నిన్నటి వరకూ భారత క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగించిన ఏడడుగుల పొడగరి, పాకిస్తానీ పేస్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్ చప్పగా సాగింది. అతడి బౌలింగ్ గురించి అంతా భయపడగా, భారత బ్యాట్స్ మెన్ ఏకంగా, స్టూలు మీద మనిషిని నిలబెట్టి బంతులు వేయించుకుని మరీ ప్రత్యేకంగా ప్రాక్టీసు చేశారు. అయితే.. ప్రపంచకప్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో ఇర్ఫాన్ ఏమంత గొప్పగా ప్రభావం చూపించలేకపోయాడు. టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో 6 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగులో భారత బ్యాట్స్మెన్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కూడా కొట్టారు. ఈ పొడగరి ఒక్క మేడిన్ ఓవర్ కూడా వేయలేకపోయాడు. దీంతో, మహ్మద్ ఇర్ఫాన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో అభిమానులు ట్వీట్లు ఇస్తున్నారు. కాగా, కోహ్లీకి ఈ మ్యాచ్ లో రెండు లైఫ్ లు లభించాయి. అఫ్రిది తన తొలి ఓవర్ 5వ బంతికి విరాట్ కోహ్లీని దాదాపు అవుట్ చేసినంత పని చేశాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ సాధించాలన్న ఉద్దేశంతో ఆడిన బంతి అక్కడ ఉన్న ఫీల్డర్ కు అంగుళాల దూరంలో పడటంతో కోహ్లి అవుట్ కాకుండా బతికిపోయాడు. ఇక, 32వ ఓవర్ 5వ బంతికి సొహైల్ బౌలింగ్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ని కీపర్ అక్మల్ వదిలాడు.