: ప్రేమ విఫలమా? హత్యా యత్నమా?: టెక్కీ సుప్రియ అనుమానాస్పద మృతి
భవనంపై నుంచి కిందపడిందో... లేక ఎవరైనా తోసేశారో తెలియదుగానీ, తాను పనిచేస్తున్న ఆఫీసులోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సుప్రియ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా యాప్రాల్ కు చెందిన టి.సుదర్శన్ కుమార్తె సుప్రియ (22) హైదరాబాదు హైటెక్ సిటీ సైబర్ పెరల్ భవంతిలోని 5వ అంతస్తులో ఉన్న యాక్సెంచర్ లో ఉద్యోగిని. రోజులానే సాయంత్రం ఆఫీసుకు వెళ్ళిన ఆమె, రాత్రి 12 గంటల సమయంలో టీ తాగేందుకు వెళ్లి అరగంటలో తిరిగి వచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. రాత్రి 1:30 గంటల సమయంలో ఒళ్ళంతా గాయాలతో బయటకు వెళ్ళే మార్గంలో పడి ఉండటాన్ని భద్రతా సిబ్బంది గమనించారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, 2:15 గంటల సమయంలో ప్రాణాలు విడిచింది. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని సుదర్శన్ పోలీసులకు తెలిపారు. సుప్రియ అదే కంపెనీలో ఒక ఉద్యోగితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.