: తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్న బొత్స
విభజన సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోనే వివిధ సంస్థలు, నదీ జలాల్లో వాటాల విషయంలో కాంగ్రెస్ స్పష్టతను ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు, ఎంసెట్ పరీక్షలపై రెండు రాష్ట్రాలూ తగాదా పడ్డాయని, ఇప్పుడు కృష్ణా జలాలపై వివాదం మొదలైందని అన్నారు. ఈ వివాదం తీవ్ర స్థాయికి వెళ్లి, పోలీసులు తన్నుకున్న తరువాతే చంద్రబాబు, చంద్రశేఖర్ రావులు ఒక అవగాహనకు వచ్చారన్నారు. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లు తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించాలని బొత్స సూచించారు.