: మున్సిపాలిటీల్లో ఇకపై ఎల్ఈడీ లైట్లే... వినోద పన్ను వసూలు చేయండి: అధికారులకు కేసీఆర్ ఆదేశం
ఇకపై మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ విద్యుద్దీపాలనే వినియోగించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. అంతేకాక పట్టణాల్లోని సినిమా థియేటర్ల నుంచి వినోద పన్నును ముక్కుపిండి మరీ వసూలు చేయాలని తీర్మానించింది. ఈ మేరకు నేడు వివిధ శాఖాధికారులతో భేటీ నిర్వహించిన సీఎం కేసీఆర్, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ విద్యుద్దీపాలను వినియోగించడం ద్వారా విద్యుత్ ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను దృష్టిలో పెట్టుకుని, అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. వినోద పన్నును ఎగవేస్తున్న సినిమా థియేటర్లపై దాడులు చేసి బకాయిలను రాబట్టాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.