: షారూఖ్ పై విజయం సాధించిన బీజేపీ ఎంపీ
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇంటి (మన్నత్) ముందు నిర్మించిన అక్రమ ర్యాంప్ ను బీఎంసీ అధికారులు తొలగించారు. బీజేపీ ఎంపీ పూనం మహాజన్ షారూఖ్ ర్యాంపును తొలగించాలని షారూఖ్ కు సూచించారు. రోడ్డును ఆక్రమిస్తూ ర్యాంపు ఎలా నిర్మిస్తారని ఆమె ప్రశ్నించారు. కాగా, 3.5 కోట్ల రూపాయలతో షారూఖ్ తన కోసం ఓ వానిటీ వ్యాన్ తయారు చేయించుకున్నారు. ఇందులో అత్యాధునిక లివింగ్ రూం, బెడ్ రూం, బాత్రూం సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దీనిని పార్క్ చేసుకునేందుకు తన ఇంటి ముందున్న రోడ్డును ఆక్రమించి ర్యాంప్ నిర్మించాడు. దీనిని స్థానికులు వ్యతిరేకించినా బాలీవుడ్ బాద్షా పట్టించుకోలేదు. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేసినా షారూఖ్ ను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. బీజేపీ ఎంపీ పూనం మహాజన్ దీనిపై సీరియస్ కావడంతో బీఎంసీ షారూఖ్ కు నోటిసులు పంపింది. వాటిని ఆయన బేఖాతరు చేయడంతో రంగంలోకి దిగిన బీఎంసీ దానిని తొలగించింది. దానికి అయిన ఖర్చు బిల్లును షారూఖ్ కు పంపనుంది. దానిని చెల్లించని పక్షంలో షారూక్ కు విద్యుత్, మంచినీరు సప్లైలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.