: 98 పరుగుల తేడాతో వరల్డ్ కప్ బోణీ కొట్టిన న్యూజిలాండ్
ప్రపంచకప్ లో న్యూజిలాండ్ భారీ తేడాతో బోణీ చేసింది. న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో జరిగిన 2015 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో శ్రీలంక జట్టుపై న్యూజిలాండ్ జట్టు 98 పరుగులతో భారీ విజయం సాధించింది. ఆండర్సన్ (75), మెక్ కల్లమ్ (65), విలియమ్సన్ (57) ధాటిగా ఆడడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. అనంతరం 332 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు ఓపెనర్ తిరుమన్నే (65) మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ దానిని కొనసాగించడంలో టాపార్డర్ దారుణంగా విఫలమైంది. దిల్షాన్ (24), సంగక్కర (39) కీలకసమయాల్లో వికెట్లు కోల్పోవడంతో జయవర్ధనే డకౌట్ కావడం శ్రీలంక జట్టుపై ఒత్తిడి పెంచింది. దీంతో మాథ్యూస్ (46) న్యూజిలాండ్ బౌలర్లపై దాడి ప్రారంభించినప్పటికీ లయతప్పని బంతులతో కివీస్ బౌలర్లు శ్రీలంక బ్యాట్స్ మన్ ను క్రీజులో కుదురుకోకుండా అడ్డుకున్నారు. దీంతో శ్రీలంక జట్టు 98 పరుగుల భారీ వ్యత్యాసంతో పరాజయం పాలైంది. 2015 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో బోణీ చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డుపుటలకెక్కింది.