: అమ్మాయిలను ఎరవేసి, లంచాలిచ్చి... చైనా అధికార టీవీ ఛానల్ లో వెలుగుచూస్తున్న పచ్చినిజాలు!
చైనా ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి మచ్చను తొలగించేందుకు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలే లక్ష్యంగా సాగుతున్న దేశాధ్యక్షుడు జి జిన్ పింగ్ కష్టాల్లో చిక్కుకున్నారు. దేశంలో ఎక్కడ ఏ విషయం జరిగినా, ప్రభుత్వ కనుసన్నల్లో మెలగుతూ, బయటి ప్రపంచానికి తాము చెప్పేదే నిజమన్న భ్రమను కలిగించే అధికార టీవీ ఛానల్ 'సీసీటీవీ'లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 70 కోట్ల మందికి పైగా నిత్యమూ తిలకించే టీవీ ఛానల్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని సంస్థ ఉద్యోగులే చెబుతున్నారు. అయితే తమ పేరు వెల్లడైతే ప్రభుత్వం వేధిస్తుందని వారు భయపడుతున్నారు. సీసీటీవీలో జరుగుతున్న అవినీతి దందాపై విచారణకు ఆదేశించిన తరువాత, అక్కడి అవినీతి పనులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సుమారు 10 వేల మందికి పైగా సీసీటీవీలో విధులు నిర్వహిస్తుండగా, 15 మందికిపైగా సీనియర్ నెట్ వర్క్ ఉద్యోగులు అదృశ్యం అయ్యారు. వీరిలో ఆర్థిక విభాగంలో న్యూస్ యాంకర్ గా ఉన్న రుయి చెన్ గాంగ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తమ సహ ఉద్యోగుల అవినీతి గురించి సమాచారం చెప్పాలని అన్యాయంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏవైనా ఇంటర్వ్యూలు చేసే సమయంలో జర్నలిస్ట్ లు తీసుకుంటున్న లంచాలను ఆపలేకపోయిన ఉన్నతోద్యోగులు ఇప్పుడు, విచారణకు భయపడి తమ ఖరీదైన కార్లను గ్యారేజ్ లలో విడిచి పెడుతున్నారు. సీసీటీవీలో ప్రమోషన్ ల ఆశ చూపి యాంకర్లు, మహిళా ఉద్యోగులను ఎందరో అధికార నేతలు లోబరచుకున్నట్టు సమాచారం. ఉన్నతోద్యోగులు తమ పబ్బం గడుపుకునేందుకు అందమైన మహిళా ఉద్యోగులను నేతలకు ఎరగా వేసేవారని కూడా ఉద్యోగులు ఆరోపించారు. తామంతా బాధితులమేనని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక మహిళా ఉద్యోగి తెలిపారు. అవినీతి ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు హు జింటావో సన్నిహితుడు గు లిపింగ్, ఆయన భార్య లింగ్ జిహును అదుపులోకి తీసుకొని విచారించగా మరిన్ని అనైతిక కార్యకలాపాలపై సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. యాంకర్ రుయి చెన్ ఈ పెద్దమనిషి బాధితురాలేనని సమాచారం. ఒక మాజీ, ఒక ప్రస్తుత యాంకర్లు మాజీ సెక్యూరిటీ చీఫ్ జియు యోంగ్ కాంగ్ తో అత్యంత సన్నిహితంగా ఉన్నారన్న ఆరోపణలతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. జియు యోంగ్ కాంగ్ రెండవ భార్య, సీసీటీవీలో యాంకర్ గా పనిచేసిన అమ్మాయిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీసీటీవీలో జరుగుతున్న అవినీతి, అసాంఘిక కార్యకలాపాల మురికిని తొలగిస్తేనే, దేశం గర్వంగా తలెత్తుకు నిలుస్తుందని ప్రజలు అంటున్నారు.