: అమ్మ బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోయేవాడిని: నాగార్జున


అమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయేవాడినని సినీ నటుడు నాగార్జున గతం గుర్తు చేసుకున్నారు. హైదరాబాదులోని హెచ్‌ఐసీసీలో 'ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటీవ్ కేర్' 22వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పెయిన్ అండ్ పాలియేటీవ్ కేర్ గురించి తెలియలేదని అన్నారు. అందుకే ఆమెకు ఈ సర్వీసును అందించలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నాన్నకు ఆరోగ్యం క్షీణించిన తరువాత డాక్టర్ సలహా మేరకు ఈ పద్ధతిని అనుసరించామని ఆయన చెప్పారు. దీంతో ఆయన తుదిశ్వాస విడిచేవరకు నొప్పి తెలియకుండానే సంతోషంగా గడిపారని ఆయన వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతూ, చివరిదశలో ఉన్న వారిపాలిట ఈ పాలియేటీవ్ కేర్ చికిత్స ఓ గొప్ప వరం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి సుమారు 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News