: విజయాలు మోదీవి...ఓటమి ఇతరులదా?: శివసేన
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమికి ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని శివసేన డిమాండ్ చేసింది. ఎన్నికల ప్రచారం మొత్తం మోదీపైనే నడిచిందని శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. భారతదేశంలో ప్రజలే సుప్రీం అని పేర్కొన్న సామ్నా, ప్రజలు తమకు ఏకపక్షంగా మద్దతు ఇస్తారనే దురభిప్రాయంలో నేతలు ఉండకూడదని హితవు పలికింది. కేజ్రీవాల్ బ్రాండ్ ఆయన మఫ్లర్ అని ప్రశంసిస్తూనే, మఫ్లర్ వల్ల ఉపయోగం లేకపోతే దానిని దూరంగా ఉంచడానికి ఆయన సిద్ధపడాలని శివసేన సూచించింది. ఒబామా పర్యటనలో మోదీ ధరించిన సూట్ సాధించిన ఖ్యాతిని కేజ్రీవాల్ మఫ్లర్ సాధించిందో లేదో ఆయనే చెప్పాలని తెలిపింది. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే పేర్కొన్నట్టు ఢిల్లీ పరాజయాన్ని మోదీ ఓటమిగా భావిస్తున్నామని శివసేన స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను తన విజయంగా ప్రచారం చేసుకున్న మోదీ, ఢిల్లీ పరాజయాన్ని కూడా తనకే ఆపాదించుకోవాలని సూచించింది.