: సచిన్ తొలుత అంగీకరించినా, తర్వాత మనసు మార్చుకున్నాడు: చాపెల్
టీమిండియాకు గతంలో కోచ్ గా వ్యవహరించి, చెడు ఇమేజ్ సొంతం చేసుకున్న ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ మరోమారు నోరు విప్పాడు. గతంలో సచిన్ ను తాను బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన రావాలని కోరగా, తొలుత అంగీకరించాడని తెలిపారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నాడని, బ్యాటింగ్ స్థానం మార్చుకునేదిలేదని తెగేసి చెప్పాడని చాపెల్ వెల్లడించాడు. తాజాగా, 'క్రికెట్ లెజెండ్స్' అనే ఓ టీవీ కార్యక్రమంలో చాపెల్ మాట్లాడుతూ, వెస్టిండీస్ లో వరల్డ్ కప్ జరిగిన సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవాలని సచిన్ కు సూచించానని తెలిపాడు. సచిన్ జట్టుకు ఏది లాభిస్తుందో అదే చేస్తాడని భావించానని, కానీ, తాను ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగాలనుకున్నాడో అదే స్థానంలో వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాడని వివరించాడు. ఇటీవలే విడుదలైన తన జీవితచరిత్ర 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో సచిన్... చాపెల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. చాపెల్ ను ఓ 'రింగ్ మాస్టర్' అని పేర్కొన్నాడు.