: చంద్రబాబుతో జేసీ భేటీ... నిన్నటి వ్యాఖ్యలపై వివరణ!
అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నిన్న జేసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మోదీ తీరుపైనే కాక రాజ్యాంగంలో పేర్కొన్న పలు అంశాలను ప్రస్తావించిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలతో బీజేపీతో పాటు దాని మిత్రపక్షం టీడీపీలోనూ పెద్ద చర్చే నడిచింది. ఈ నేపథ్యంలో సదరు వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకే జేసీ, చంద్రబాబును కలిసి ఉంటారన్న వాదన వినిపించింది. ఈ వాదనను బలపరుస్తూ... నిన్నటి తన వ్యాఖ్యలపై జేసీ, చంద్రబాబుకు వివరణ ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.