: పరిహారమెంతో చెప్పండి... భూములిస్తామో లేదో చెబుతాం: కలెక్టర్ తో గన్నవరం రైతులు
నవ్యాంధ్ర రాజధానికి కీలకంగా మారనున్న గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. విమానాశ్రయం విస్తరణకు అవసరమైన భూ సేకరణపై కొద్దిసేపటి క్రితం కృష్ణా జిల్లా కలెక్టర్ గన్నవరం పరిసర ప్రాంతాలకు చెందిన రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ విలువైన భూములను విమానాశ్రయం విస్తరణ కోసం ఇచ్చే విషయంలో రైతులు తర్జనభర్జన పడ్డారు. ఈ క్రమంలో అసలు ప్రభుత్వం నుంచి ఎంత పరిహారం వస్తుందో తెలపాలంటూ కలెక్టర్ ను రైతులు కోరారు. రైతుల నుంచి ఊహించని ప్రశ్న ఎదురుకావడంతో కలెక్టర్ నోరెళ్లబెట్టారు. ‘‘మా భూములకు పరిహారం ఎంతిస్తారో చెప్పండి. ఆ తర్వాత భూములను ఇవ్వాలో, లేదో ఆలోచించుకుని చెబుతాం’’ అని రైతులు, కలెక్టర్ కు తేల్చిచెప్పారు. పరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో కలెక్టర్ సమావేశాన్ని వాయిదా వేశారు. 'తదుపరి భేటీలో పరిహారం తదితర వివరాలను మాట్లాడుకుందాం' అంటూ ఆయన రైతులను సాగనంపారు.