: మిరాక్ మమ్మల్ని మోసం చేసింది... క్రిమినల్ కేసుల దిశగా ‘సహారా’ చర్యలు
భారీ రుణమిప్పిస్తామని చెప్పి నెలల తరబడి తిప్పుకున్న మిరాక్ కేపిటల్ చివరకు తమను మోసం చేసిందని సహారా ఇండియా గ్రూపు ఆవేదన వ్యక్తం చేసింది. స్వల్ప కాలంలో అధిక రాబడులిస్తామని చెబుతూ నిబంధనలను తుంగలో తొక్కి, పెద్ద సంఖ్యలో అక్రమంగా డిపాజిట్లు సేకరించిన సహారా ఇండియా పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. ఈ విషయంపై దృష్టి సారించిన సెబీ, సహారా చీఫ్ సుబ్రతో రాయ్ పై కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా ఆయన జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బెయిల్ కోసం సుబ్రతో రాయ్ చేయని యత్నం లేదు. చివరకు సంస్థ ఆస్తులు విక్రయించి అయినా బయటకు రావాలని ఆయన చేసిన యత్నం కూడా బెడిసికొట్టింది. రూ.10 వేల కోట్లు డిపాజిట్ చేస్తే బెయిల్ పిటిషన్ ను పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు, అందుకోసం రాయ్ కు పలుమార్లు వాయిదాలు పొడిగించింది. ఈ క్రమంలో, విదేశాల్లో సంస్థ కొనుగోలు చేసిన మూడు లగ్జరీ హోటళ్లను అమ్మిపెట్టి రెండు బిలియన్ డాలర్ల రుణమిప్పిస్తామని మిరాక్ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ఆ సంస్థ తాజాగా చేతులెత్తేసింది. దీంతో కంగుతిన్న సుబ్రతో రాయ్, మిరాక్ పై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. సుబ్రతో ఆదేశాలతో మిరాక్ పై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టేందుకు సహారా ఇండియా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ దిశగా చర్యలు మొదలుపెట్టినట్టు సంస్థ ప్రతినిధి నిన్న చెప్పారు.