: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్రం సిఫారసు
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కు ఓ సిఫారసు లేఖ పంపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో, వెంటనే రాష్ట్రపతికి కేంద్రం సమాచారం ఇచ్చింది. గతేడాది అధికారంలోకి వచ్చిన 49 రోజుల్లోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో, ఢిల్లీ అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లింది. తరువాత రాష్ట్రపతి పాలన కిందకు వచ్చింది. అప్పటినుంచి ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో తాజాగా ఎన్నికలు జరిగాయి.