: యోగా ప్యాంట్లను నిషేధించండి: అమెరికా చట్టసభలో మోంటానా ప్రతినిధి బిల్లు
భారత్ లో పుట్టి పెరిగిన యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. యోగా పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో యోగా తరగతులు అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆ దేశంలో యోగా దుస్తుల మార్కెట్ 30 బిలియన్ డాలర్లకు చేరింది. ఇవేవీ పట్టని ఆ దేశ చట్టసభ సభ్యుడొకరు యోగా దుస్తులపై (ప్రత్యేకించి ప్యాంట్లు) నిషేధం అమలు కోసం రంగంలోకి దిగారు. మోంటానా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ మూర్ ఈ మేరకు అమెరికా చట్టసభలో బిల్లు కూడా ప్రతిపాదించారు. గత వేసవిలో మిస్సౌలా పట్టణంలో నగ్నంగా సైకిల్ ర్యాలీ జరిగింది. దానిపై నిషేధం అమలయ్యేలా చర్యలు తీసుకున్న మూర్, తాజాగా యోగా ప్యాంట్లపై పడ్డారు. యోగా ప్యాంట్లను ధరించడం ద్వారా దేహంలో అంతర్భాగంగా ఉండే జననాంగాలు బహిర్గతంగా కనిపిస్తూ, ఎదుటి వ్యక్తులను లైంగికోద్దీపనలకు గురిచేస్తాయని ఆయన ఆరోపిస్తున్నారు. యోగా ప్యాంట్లను మహిళలే కాక పురుషులు ధరించడాన్ని కూడా నిషేధించాలని ఆయన తన బిల్లులో ప్రతిపాదించారు. గడచిన మంగళవారం చట్టసభ ముందుకు వచ్చిన ఈ బిల్లుపై అమెరికన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.