: సింహాన్ని కొమ్ములతో కుమ్మేసిన గేదె... జాంబియా పార్కులో గంటపాటు భీకర పోరు
ఆకలి తీర్చుకునేందుకు సింహం, ప్రాణాలు కాపాడుకునేందుకు అడవి గేదె... గంటపాటు భీకరంగా పోరు సాగించాయి. జాంబియాలోని దక్షిణ లాంగ్వా జాతీయ పార్కులో ఇటీవల జరిగిన ఈ పోరులో రెండు జంతువులూ తీవ్రంగా గాయపడ్డాయి. గేదె చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి, పొద్లలోకి పరారైన సింహం, రెండు రోజుల తర్వాత చనిపోయిందట. వివరాల్లోకెళితే... ఆకలితో నకనకలాడుతున్న సింహం తనకు కనిపించిన అడవి పశువుల మందపై దాడి చేసింది. సింహం రాకతో మందలోని గేదెలన్నీ పారిపోగా, ఓ గేదె మాత్రం దొరికిపోయింది. అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగుపెట్టడం మానేసిన గేదె, సింహంతో పోరుకే సై అంది. ఈ క్రమంలో సింహం దాడి చేయగా, గేదె తన పదునైన కొమ్ములతో విరుచుకుపడింది. గంటపాటు భీకరంగా పోరాడాయి. చివరకు సింహమే తోకముడిచింది. గేదె కొమ్ముల దాడిలో గాయపడి ప్రాణాలు దక్కించుకునేందుకు సింహం పొదల్లోకి పారిపోయింది. గేదె చేసిన గాయాల కారణంగా రెండు రోజుల తర్వాత చనిపోయింది. పార్కులో సఫారీ గైడ్ గా పనిచేసే ఆర్మ్ స్ట్రాంగ్ ఫోర్డ్ అనే వ్యక్తి ఈ పోరాట దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు.