: కామంతో కళ్లు మూసుకుపోయిన గుమాస్తా... ఇళ్లకు పయనమైన విద్యార్థినులు
స్కూళ్లలో పనిచేసే సిబ్బందికి మానసిక రుగ్మతలు ఉన్నట్టు కనిపిస్తోంది. కుమార్తెలు, చెల్లెళ్లను విద్యార్థినుల్లో చూడాల్సిన స్కూలు సిబ్బంది, వారిని కామదాహం తీర్చే యంత్రాలుగా చూస్తూ, వికృత మనస్తత్వాలను బయటపెట్టుకుంటున్నారు. ఒడిషాలోని గంజాం జిల్లాలో సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే సంఘటన జరిగింది. గంజాంలోని కస్తూరి గాంధీ బాలిక విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న ఆరు, ఏడు తరగతులకు చెందిన విద్యార్థినులు గతేడాది పిక్ నిక్ కు వెళ్లారు. వాటర్ ఫాల్ వద్దకు వెళ్లిన విద్యార్థినులు అక్కడ స్నానాలు చేశారు. చిన్నపిల్లలు, అంతా ఆడపిల్లలు కావడంతో బెరుకు లేకుండా స్నానాలు చేశారు. దీనిని వంటమనిషి సహాయంతో ఆ స్కూలు గుమాస్తా సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ విషయం ప్రిన్సిపల్ కు తెలియడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న విద్యార్థినులు ఆందోళనతో ఇంటిబాటపట్టారు. మొత్తం 87 మందిలో 60 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రిన్సిపల్ ఫిర్యాదుతో గుమస్తాపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హాస్టల్ లో ఉన్న విద్యార్థినుల రక్షణ కోసం ఓ మహిళా కానిస్టేబుల్ ను అక్కడ నియమించారు.