: ల్యాండ్ పూలింగ్ పై చంద్రబాబును హెచ్చరించిన ఉండవల్లి


ఏపీలో ల్యాండ్ పూలింగ్ విధానంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. రాజధాని రైతులు తమ భూములను బలవంతంగా వదులుకోవాల్సి వస్తే చట్టపరమైన సహాయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు. ఈరోజు రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన ఉండవల్లి, భూమి ఇచ్చేందుకు ఇష్టపడని రైతులతో మాట్లాడారు. ఒక్క ఏపీలో తప్ప ఇంతవరకు ల్యాండ్ పూలింగ్ దేశంలో ఎక్కడా వివాదాస్పదం కాలేదన్నారు. "భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులతో నేను మాట్లాడాను. వారంతా భయాందోళనలకు గురవుతున్నారు. రాజధాని ప్రాంతంలో అన్ని భూములు సారవంతమైనవి" అని ఉండవల్లి పేర్కొన్నారు. కాబట్టి రైతుల నుంచి బలవంతంగా భూమి తీసుకోవడం సరికాదన్నారు. ఫలవంతమైన భూమిలో రాజధాని నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక హేతుబద్ధతను ఆయన ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణను ఆపేందుకు అవసరమైతే తాను కోర్టుకు వెళతానని చెప్పారు. పార్లమెంటులో ఈ విషయంపై చర్చించాలని పార్టీలన్నింటినీ కోరతానని ఉండవల్లి అన్నారు. వైఎస్ఆర్ సీపీ కంటే టీడీపీకి ఒక్క శాతం అదనపు ఓట్లు రావడంవల్లే చంద్రబాబు సీఎం అయ్యారని, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News