: జట్టులో లేడు... భారత్ ను చిత్తుగా ఓడించాలని కోరుతున్నాడు!
అది వరల్డ్ కప్ అయినా, ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ అయినా... భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతుంటే అక్కడ హై టెన్షన్ నెలకొంటుంది. ఆటగాళ్లు కొదమసింహాల్లా పోరాడతారు... అభిమానులు ప్రతి బంతికీ ఊగిపోవడం కనిపిస్తుంది. ఇప్పుడు ఐసీసీ వరల్డ్ కప్ లో దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు. అక్రమ బౌలింగ్ యాక్షన్ అంటూ ఐసీసీ అతడికి పరీక్షలు నిర్వహించి క్లీన్ చిట్ ఇచ్చినా, అప్పటికే ఆలస్యం అయింది. వరల్డ్ కప్ కు పాక్ జట్టును అంతకుముందే ప్రకటించేశారు. దీంతో, అజ్మల్ తీవ్ర నిరాశ చెందాడు. అయితే, భారత్ ను మాత్రం పాక్ చిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, "వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ లో ఆడాలని ఎవరు కోరుకోరు? నేనూ అంతే. జట్టులో చోటు దక్కకున్నా మావాళ్లు వరల్డ్ కప్ లో భారత్ ను ఓడించడం చూడాలనుకుంటున్నా. ఈసారి భిన్నమైన ఫలితం వస్తుందనిపిస్తోంది. ఎందుకంటే, టీమిండియా ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. ఆసీస్ లో పరిస్థితులకు వారింకా అలవాటు పడినట్టు కనిపించడంలేదు" అని పేర్కొన్నాడు.