: మా, స్టార్ టీవీల డీల్ విలువ రూ.2,500 కోట్లు?: దేశీయ టీవీ చానెళ్ల విభాగంలో అతిపెద్ద డీల్!
తెలుగు వినోద రంగంలో విశేష ఆదరణ పొందిన మా టీవీ గొడుగు కిందనున్న నాలుగు చానెళ్లు స్టార్ ఇండియా పరమయ్యాయి. ఈ మేరకు నిన్న మా టీవీ, స్టార్ ఇండియాల మధ్య ఒప్పందం కుదిరింది. దేశీయ టీవీ చానెళ్ల విభాగంలో అతిపెద్దది గా పరిగణిస్తున్న ఈ డీల్ విలువ రూ.2,500 కోట్ల పైనే ఉంటుందని విశ్వసనీయ సమాచారం. మా టీవీ గ్రూపులోని నాలుగు చానెళ్లను స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. ఒక్క నెట్ వర్క్ మినహా, బ్రాడ్ కాస్టింగ్ వ్యాపారం, బ్రాండ్, ఆస్తులను ఏకమొత్తంగా కొనుగోలు చేస్తున్నట్లు స్టార్ ఇండియా ప్రతినిధి ఉదయశంకర్ ప్రకటించారు. అయితే ఈ డీల్ విలువ ఎంత అన్న విషయంపై అటు మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ కాని, ఉదయశంకర్ కాని వెల్లడించలేదు. కొనుగోలు ఒఫ్పందం కార్యరూపం దాల్చేందుకు సమయం పట్టనున్న నేపథ్యంలో ఇప్పుడే సదరు విలువను ప్రకటించలేమని వారు వెల్లడించారు. ప్రస్తుతం మా టీవీ విలువ రూ.1,800ల నుంచి రూ.2 వేల కోట్ల మేర ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ క్రమంలో రూ.2,500 కోట్లకు మా టీవీని స్టార్ ఇండియా కొనుగోలు చేసి ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.