: కొడుకును చూద్దామని వెళ్లిన భారతీయుడిపై అమెరికా పోలీసుల దాష్టీకం!
కన్న కొడుకును, మనవళ్ళనూ చూద్దామని అమెరికాకు వెళ్ళిన ఓ పెద్దాయన అక్కడి పోలీసుల దురుసుతనానికి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన అలబామాలో జరుగగా, గాయపడ్డ సురేంద్ర భాయ్ పటేల్ ను కింద పడదోసిన పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్టు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన కుమారుడి ఇంట్లో సురేంద్ర భాయ్ వున్న సమయంలో తమ ఇంట దొంగతనం జరిగిందని పక్కింట్లో నుంచి పోలీసులకు సమాచారం వెళ్ళింది. అక్కడకు చేరుకున్న అధికారులకు జేబుల్లో రెండు చేతులూ పెట్టుకున్న సురేంద్ర భాయ్ కనిపించాడు. అతన్ని సోదాలు చేస్తున్న సమయంలో ఆ పోలీసు కాస్త కరకుదనాన్ని చూపాడు. సురేంద్ర భాయ్ వయస్సును పరిగణనలోకి తీసుకోకుండా ఆయనను కింద పడుకోబెట్టే క్రమంలో గట్టిగా తోయడంతో గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. తన తండ్రిని అకారణంగా పోలీసులు వేధించారని, రక్తం వచ్చేలా కొట్టారని సురేంద్ర భాయ్ కొడుకు కేసు వేశారు.