: మాంఝీ... బల పరీక్షలో మెజారిటీ నిరూపించుకోండి: బీహార్ సీఎంకు గవర్నర్ ప్రతిపాదన
బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ప్రతిపాదనను తిరస్కరించిన ఆ రాష్ట్ర గవర్నర్ త్రిపాఠి 'బల పరీక్షలో మెజారిటీ నిరూపించుకోండి' అంటూ మాంఝీకి నిన్న ఆహ్వానం పలికారు. జేడీయూ శాసనసభా పక్ష నేతగా నితీశ్ కుమార్ ఎంపికపై హైకోర్టు స్టే నేపథ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నితీశ్ ఓ అడుగు వెనక్కేయగా, బలం నిరూపించుకునేందుకు మాంఝీ వర్గం ముందడుగేసింది. అసెంబ్లీలో సభ్యత్వం లేని నితీశ్ ను జేడీయూ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడం కుదరదని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని మాంఝీ చేసిన విజ్ఞప్తిని గవర్నర్ త్రిపాఠి తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుని మాంఝీ బలపరీక్షకు అనుమతి ఇచ్చారు. ఈ నెల 20ని ముహూర్తంగా నిర్ణయించారు. ఈ క్రమంలో 20లోగా బీహార్ రాజకీయాలు మరెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.