: ఆప్ కు ఇచ్చిన నోటీసులో ఐటీ శాఖ అడిగిన ఏడు ప్రశ్నలివే!
ఎన్నికల విరాళాలపై వివరణ కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులో, ఏడు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ఆప్ ను ఐటీ శాఖ కోరింది. ఫిబ్రవరి 16లోగా ఈ నోటీసుకు స్పందించాలని ఆదేశించింది. రూ. 2 కోట్ల విరాళాలకు సంబంధించి ఆప్ మాజీ నేతలు ఆ పార్టీపై విమర్శలు చేశారు. ముఖ్యంగా గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీ అర్ధరాత్రి రూ. 50 లక్షల విరాళాలను నాలుగు కంపెనీలు అందించాయని... ఈ కంపెనీలన్నీ తప్పుడు అడ్రస్ లను కలిగి ఉన్నాయని, నీతిమంతమైన వ్యాపారం చేయడం లేదని, ఈ విరాళాలు చట్ట విరుద్ధం (మనీ లాండరింగ్) అని ఆరోపించారు. ఇదే విషయంపై ఈ మధ్యకాలంలో బీజేపీ స్పందిస్తూ, 'హవాలా అట్ మిడ్ నైట్' అంటూ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో, దీనిపై స్పందించిన ఐటీ శాఖ ఆప్ కు నోటీసులు జారీచేసింది. ఇందులో ఏడు అంశాలకు సంబంధించిన వివరాలను అడిగింది. అవి ఏమిటంటే... 1. రూ. 50 లక్షల విరాళాలకు సంబంధించిన ఆధారాలు. 2. ఆప్ కు-ఆ నాలుగు కంపెనీలకు మధ్య మరేమైనా సంబంధాలు ఉన్నాయా? 3. ఒకవేళ ఉంటే, ఎలాంటి సంబంధాలు? 4. డాక్యుమెంట్లలో ఉన్న చిరునామాల్లో కంపెనీలు, వాటి డైరెక్టర్లు లేనట్టయితే... వారి ప్రస్తుత వివరాలు తెలపండి. 5. విరాళాలను చెల్లించిన వ్యక్తుల వివరాలు. 6. చెక్ లు ఇచ్చిన వ్యక్తులకు ఏమైనా రీసీట్ ఇచ్చారా? 7. చెక్ లు ఇచ్చిన వ్యక్తుల నుంచి కన్ఫర్మేషన్ లెటర్స్ కావాలి. పైన పేర్కొన్న ఏడు అంశాలకు సంబంధించిన వివరాలను ఈ నెల 16లోగా ఇవ్వాలని ఆప్ ను ఐటీ శాఖ కోరింది.