: తలసానీ... నిన్ను ఓడించడానికి చంద్రబాబు అవసరంలేదు, కార్యకర్త చాలు: టీడీపీ
టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీడీపీ మీడియా ప్రతినిధి రాజారాం యాదవ్ నిప్పులు కక్కారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తలసానిని ఓడించడానికి పార్టీ అధినేత చంద్రబాబు అవసరం లేదని, సాధారణ కార్యకర్త చాలు అని వ్యాఖ్యానించారు. తలసాని మంత్రి పదవి కోసం కేసీఆర్ పక్షాన చేరారని విమర్శించారు. అంతకుముందు, చంద్రబాబు వచ్చి పోటీ చేసినా ఉప ఎన్నికల్లో తన విజయాన్ని అడ్డుకోలేరని తలసాని వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా, తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత కేసీఆర్ కు ప్రాణం, పదవి పోతాయేమోనన్న భయం పట్టుకుందని రాజారాం యాదవ్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడున్న సచివాలయాన్ని కొనసాగిస్తే కేసీఆర్ కు ప్రాణగండం, పదవీగండం తప్పదని చినజీయర్ స్వామి పేర్కొన్న నేపథ్యంలోనే, సచివాలయాన్ని తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.