: తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ టెర్రర్... అనంతలో మహిళ మృతి, తెలంగాణలో మరో 49 మందికి నిర్ధారణ
ప్రాణాంతక స్వైన్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తూనే ఉంది. ఇప్పటికే 50 మందికి పైగా పొట్టనబెట్టుకున్న ఈ వైరస్, మరింత మందికి సోకుతూ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి అనంతపురం జిల్లా తనకల్లు మండలం గొల్లపల్లికి చెందిన మహిళ నేటి ఉదయం మృత్యువాత పడింది. వైరస్ సోకిన కారణంగా రెండు వారాల క్రితం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ మరణించింది. ఇదే జిల్లాలో స్వైన్ ఫ్లూ బారినపడ్డ మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక తెలంగాణనూ స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 42 మంది ప్రాణాలను హరించిన ఈ వైరస్, మరికొందరికి సోకింది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారికి పరీక్షలు చేసిన వైద్యులు 49 మందికి వైరస్ సోకిందని నిర్ధారించారు.