: భార్యను చంపిన మొసలిపై ప్రతీకారం తీర్చుకున్నాడు
తన భార్య, ఆవిడ గర్భంలోని శిశువును ఓ మొసలి అమాంతం నమిలి మింగేయడాన్ని ముబారక్ బటాంబుజే అనే వ్యక్తి తట్టుకోలేకపోయాడు. దీంతో దానిపై ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. కసిగా చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెలితే... ఉగాండాలో నాలుగు నెలల క్రితం ముబారక్ బటాంబుజే భార్య దిమెత్రియా నబిరే (గర్భిణి) తన గూడెం మహిళలతో కలిసి నీళ్లు తీసుకురావడానికి క్యోగా సరస్సు దగ్గరికి వెళ్లింది. సరస్సులో నీళ్లు తీసుకుందామని కొంచెం లోపలికి వెళ్లగానే ఒక మొసలి అమాంతం ఎగబడి ఆమెను నీటిలోకి ఈడ్చుకుపోయింది. దీంతో ఆమె ఆనవాళ్లు కూడా లభించలేదు. జనవరిలో ఆ మొసలి మరోసారి కనిపించిందని ముబారక్ విన్నాడు. దీంతో దానిని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి దానిని కనుగొన్నాడు. దానిని రాళ్లు, కర్రలతో చంపేందుకు ప్రయత్నించారు. కానీ ఏమీ చేయలేకపోయారు. దీంతో స్థానికంగా ఉండే ఓ కమ్మరి దగ్గరికి వెళ్లి తానేం చేయాలనుకుంటున్నాడో చెప్పాడు. దీంతో ఆయన ఓ ప్రత్యేకమైన ఈటెని తయారుచేశాడు. దానితో గంటన్నర సేపు పోరాడి, మట్టుపెట్టాడు. నాలుగు మీటర్ల పొడవు, 600 కేజీల బరువుతో ఉన్న మొసలిని చంపడంతో ఆ గ్రామానికి హీరోగా మారాడు.