: ఫిబ్రవరి 15న పెద్ద చిక్కేవచ్చిపడింది...ఎలా?
ఫిబ్రవరి 15న యువకులకు పెద్దచిక్కే వచ్చిపడింది. జయనామ సంవత్సరం మాఘమాసం బహుళశుద్ధ ఏకాదశి అనగా ఫిబ్రవరి 15వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెళ్లిసందడి నెలకొంది. ఆ రోజు ఆదివారం కావడంతో పెళ్లిళ్లలో సందడి చేయవచ్చని భావించిన యువకులకు అదే రోజు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండడంతో డీలా పడిపోతున్నారు. ఐసీసీ ఏరికోరి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను సెలవు రోజున వచ్చేలా సెట్ చేసింది. ఈ ఏడాది పెళ్లిళ్ల ముహూర్తాలు తక్కువ ఉండడానికి తోడు, అదే రోజు మంచి ముహూర్తం కావడంతో చాలా మంది వివాహాలకు సిద్ధమైపోతున్నారు. దీంతో ఆప్తుల వివాహానికి, మోస్ట్ డిజైరబుల్ మ్యాచ్ కి పోటీ పడింది. దీంతో మ్యాచా? లేక మ్యారేజా? అనే విషయాన్ని ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదింటికే మ్యాచ్ మొదలవుతుంది. ఆంధ్రా క్రికెట్ అభిమానులకు కాలం కలసి వచ్చినట్టే, ఎందుకంటే అక్కడ ముహూర్తాలు వేకువ జామున ఉంటాయి. తెలంగాణలో మాత్రం ఇది విపత్కర పరిస్థితే. అక్కడ ముహూర్తాలు పగలు ఉంటాయి. దీంతో ఏం చేయాలో సగటు అభిమానులకు తోచడం లేదు. దీంతో కొత్త బిజినెస్ ఐడియాకు కల్యాణ మండపాల యజమానులు తెరతీశారు. వివాహంతో పాటు మ్యాచ్ ను కూడా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అలా చేస్తే మ్యాచ్ తో పాటు మ్యారేజ్ కూడా రంజుగా ఉంటుందని పేర్కొంటున్నారు.