: మోదీ వెంట నడిచిన మధ్యతరగతి కేజ్రీవాల్ కే పట్టం కట్టింది
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలిచిన మధ్యతరగతి ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ కు బ్రహ్మరథం పట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీద బిక్కీ, బడుగువర్గాలు, కార్మికులు, కర్షకులతోపాటు దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ వెంటే నడుస్తారని, ఆ పార్టీకే ఓటు వేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇక మధ్యతరగతి ప్రజలు, సంపన్న వర్గాలు సార్వత్రిక ఎన్నికల్లోలాగా బీజేపీకి మద్దతిస్తాయని వారు భావించారు. అయితే తాజా ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే నమ్మాయి. సంపన్న వర్గాల్లో బీజేపీ తన పట్టు నిరూపించుకోగా, ఢిల్లీలో మధ్య తరగతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న దర్యా గంజ్, జనక్ పురి, కరోల్ బాగ్, చాందినీ చౌక్, పజర్ గంజ్, మోతీనగర్ ప్రాంతాల ప్రజలు ఆప్ కు ఓట్లేశారు. ఈ ప్రాంతాల్లో ఆప్ కు 60 శాతంపైగా ఓట్లు పడ్డట్టు విశ్లేషణలు చెబుతున్నాయి. కాగా గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లోనే బీజేపీ సత్తాచాటడం విశేషం. ఈసారి కూడా తమకే ఓటేస్తారని భావించిన మోదీ అంచనాలను స్థానికులు తల్లకిందులు చేశారు. సంప్రదాయబద్ఢంగా బీజెపీ మద్దతుదారులైన వ్యాపార వర్గం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెంటే నడవడం విశేషం. దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దిల్షాద్ కాలనీ, బీఆర్ అంబేద్కర్ నగర్ కాలనీ, గోవింద్ పురి లాంటి ప్రాంతాల్లో ఓటర్లు ఆప్ నే విశ్వసించారు. సంపన్న వర్గాలు నివసించే ఫ్రెండ్స్ కాలనీ, వసంత్ విహార్, గోల్ఫ్ లింక్స్, డిఫెన్స్ కాలనీ, గ్రేటర్ కైలాష్, హౌజ్ ఖాస్, వసంత్ కుంజ్, లజ్ పత్ నగర్, పంజాబీబాగ్ ప్రాంతాల్లో బీజెపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాగా, ఢిల్లీలో 60 శాతం పైగా ఓటింగ్ శాతం నమోదవగా, అందులో ఆమ్ ఆద్మీ పార్టీకి 54.3 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 32.2 శాతం ఓట్లు వచ్చాయి.