: ఫిబ్రవరి 14... రాజీనామా చేసిన రోజే తిరిగి సీఎంగా పదవి చేపట్టనున్న కేజ్రీవాల్!


ప్రపంచానికి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు మాత్రమే. కాని ఢిల్లీ సీఎంగా రెండోసారి పదవి చేపట్టనున్న కేజ్రీవాల్ కు ఫిబ్రవరి 14... అంతకంటే ప్రాముఖ్యత కలిగిన రోజు. ఎందుకంటే తృణప్రాయంగా భావించి సీఎం పదవిని వదిలేసిన రోజు, మారోమారు అదే పదవిని చేపడుతున్న రోజు కూడా అదే కాబట్టి. గతేడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ రాజధాని శాంతి భద్రతల విషయంలో ఆయన కేంద్రంపై కాలు దువ్వారు. విధిలేని పరిస్థితుల్లో 49 రోజులకే గతేడాది ఫిబ్రవరి 14న పదవిని తృణప్రాయంగా వదిలేశారు. ఏడాదిగా ఢిల్లీ సీఎం పీఠాన్ని ఖాళీగా ఉంచేశారు. తాజాగా ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో మరో మరిచిపోలేని రికార్డును నమోదు చేశారు. 70 సీట్లలో 67 సీట్లను గెలుచుకున్న కేజ్రీవాల్, రెండోసారి సీఎం పదవి చేపట్టబోతున్నారు. అది కూడా సరిగ్గా తాను రాజీనామా చేసిన ఫిబ్రవరి 14నే. ఈ నెల 14న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ఆయన ఢిల్లీకి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14, కేజ్రీవాల్ కు ప్రత్యేకమైన రోజు అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పొచ్చు.

  • Loading...

More Telugu News