: లోక్ సభలో కాంగ్రెస్ కు జరిగిన పరాభవమే... ఇప్పుడు బీజేపీకి జరిగింది


ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పూర్తి స్థాయిలో పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఆనాడు, బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా నిలబడిన మోదీ హవాకు యూపీఏ పక్షాలు విలవిల్లాడాయి. పదేళ్లపాటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీకి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే... ఆ పార్టీకి ఎంతటి ఘోర పరాభవం ఎదురైందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి అవసరమైనన్ని సీట్లు సాధించని కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఎలా కట్టబెట్టేదంటూ, బీజేపీ నేతలు అపహాస్యం చేసిన సంగతి కూడా తెలిసిందే. తమకు ప్రతిపక్ష హోదా కూడా కల్పించకపోవడం దారుణమంటూ కాంగ్రెస్ నేతలు పార్లమెంటు సాక్షిగా మొరపెట్టుకున్న ఘటనలను కూడా మరచిపోలేం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఇప్పుడు పరాభవం పాలయింది మాత్రం దేశంలో చక్రం తిప్పుతున్న బీజేపీ. మొత్తం 70 స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీలో సామాన్యుడి పార్టీ అయిన ఆప్ ప్రభంజనం సృష్టించింది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ పై అత్యంత విశ్వాసాన్ని ప్రకటించారు. ప్రస్తుత ట్రెండ్ ను బట్టి 67 స్థానాల వరకు ఆప్ గెలుచుకోనుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా మరే పార్టీకి దక్కే అవకాశమే లేదు. మోదీ ప్రభంజనంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్న బీజేపీ... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అత్యంత దారుణంగా చతికిల పడి, ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని స్థితికి దిగజారిపోవడం బీజేపీ అగ్రనేతలకు మింగుడుపడని అంశమే.

  • Loading...

More Telugu News