: ఆప్ ప్రభంజనానికి కారణాలివే


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం దిశగా సాగుతోంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లను చావుదెబ్బ కొట్టిన 'ఆప్' ఇప్పుడు సగర్వంగా ఢిల్లీ పీఠం అధిష్ఠించనుంది. అసలు ఈ స్థాయిలో ప్రభంజనం ఎలా సాధ్యమైంది? అంటే, అందుకు కేజ్రీవాల్ సమర సన్నద్ధత, ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలు కూడా తోడ్పడ్డాయని చెప్పవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ అన్నీ తానై బలగాలను నడిపారు. ఇతర పార్టీలు, మత సంస్థల సహకారం తీసుకోకుండా, తన పేరు మీదే ఎన్నికల బరిలోకి ఉరికారు. ఆప్ నిధుల రూపంలో అందింది నల్లధనం అని ఆరోపణలు రాగానే, తన సచ్ఛీలత నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. గతంలో 49 రోజుల పాలన అనంతరం తప్పుకున్నందుకు నిజాయతీగా ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. ప్రత్యర్థులను వ్యక్తిగతంగా విమర్శించకుండా, ఢిల్లీ అభివృద్ధే తన అజెండా అని చాటారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఎన్ని విమర్శలు చేసినా హుందాగా స్వీకరించారే తప్ప, ఆమెను పల్లెత్తుమాట అనలేదు. దమ్ముంటే ఢిల్లీ అభివృద్ధిపై చర్చకు రమ్మని సవాల్ విసరగా, బేడీ అందుకు వెనుకంజ వేయడం కేజ్రీకి లాభించింది. అటు, ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో వన్ మ్యాన్ ఆర్మీలా వ్యవహరించి బీజేపీకి విజయాలు కట్టబెట్టిన మోదీ ఛరిష్మా ఢిల్లీలో పనిచేయలేదు. రూ.10 లక్షల విలువైన సూట్ ధరించిన మోదీ కంటే మఫ్లర్ మ్యాన్ గా వినుతికెక్కిన కేజ్రీవాలే మిన్న అని ఢిల్లీ ఓటరు మీట నొక్కి మరీ చెప్పాడు. మూణ్నాలుగు నెలల ముందే ఎన్నికల సన్నాహకాలకు దిగడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ముందంజలో నిలిపింది. ఆ పార్టీ నేతలు, వలంటీర్లు ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి పార్టీ విధివిధానాలను విశదీకరించారు. తద్వారా, ఆప్ వైఖరి ఏమిటన్నదానిపై ఓటరుకు స్పష్టత ఏర్పడింది. అదే సమయంలో, బీజేపీ, కాంగ్రెస్ కేజ్రీవాల్ పై విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చి దారుణమైన తప్పిదానికి పాల్పడ్డాయి. గత ప్రభుత్వాల పాలనతో ఎంతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలకు ఆ రెండు పార్టీల ధోరణి మరింత ఏహ్యభావాన్ని కలిగించింది. ఆ తీవ్ర విముఖతే నేడు ఫలితాల రూపంలో వెల్లడైంది. నియోజకవర్గాల వారీగా సమస్యలను ఎత్తిచూపుతూ ఆప్ ప్రచారం సాగించగా... పేరున్న నేతలు వచ్చి తమకు ఓట్లు కురిపిస్తారని జాతీయ పార్టీల అభ్యర్థులు భావించారు. అయితే, ఓటరు చాకచక్యం ముందు కాంగ్రెస్ ఎందుకు కొరగాకుండా పోగా, బీజేపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక వెల్లకిలా పడింది. 'అవినీతిపై పోరాడుతాడు' అన్నది కేజ్రీకి ట్యాగ్ లైన్ లా ఉపకరించింది. మచ్చలేని వ్యక్తిత్వం కావడంతో ప్రజలు ఆయనపై నమ్మకముంచారు. గతంలో చేసిన తప్పు మరోసారి జరగదని బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా కేజ్రీ ఎన్నికలకుముందే గెలిచారని ప్రీ పోల్స్ ద్వారా స్పష్టమైంది. ఇక, కాంగ్రెస్ బలమైన అభ్యర్థిత్వం లేక చతికిలపడడం కూడా ఆప్ కు లాభించింది. ఎప్పుడూ కాంగ్రెస్ కు మద్దతిచ్చే దళితులు, ముస్లిింలు ఈసారి ఆప్ కు జై కొట్టారని అర్థం చేసుకోవచ్చు. అటు, కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడంతో బీజేపీలో విభేదాలు తలెత్తడం తెలిసిందే. స్థానిక నేతలను కలుపుకోలేకపోవడం ఆమె వైఫల్యాల్లో ఒకటి. కనీసం తాను విజయం సాధించలేకపోయింది. కేజ్రీవాల్ చర్చకు రమ్మని విసిరిన సవాల్ కు దీటుగా స్పందించకపోవడం ఆమెకు మైనస్ లా మారింది. కార్టూన్ ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నామని బీజేపీ నేతలు భావించినా, ప్రజల్లో ఆయనపై సానుభూతి అంతకు రెట్టింపైంది. ఒక్కడిపై ఇంతమంది పోరు సాగిస్తున్నారన్న విషయం ఓటరుకు తెలియంది కాదు. తనకేం కావాలో అంతకంటే బాగా తెలిసిన ఓటరు... తనకు బాగా తెలిసిన వ్యక్తికే పట్టం కట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలంగా చాటాడు.

  • Loading...

More Telugu News