: మోదీకి జనాలు ఓట్లు ఎందుకు వేశారో బీజేపీ అర్థం చేసుకోలేకపోయింది... అందుకే ఈ పరాభవం: జేపీ
పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఎందుకు పట్టం కట్టారన్న విషయాన్ని ఆ పార్టీ అర్థం చేసుకోలేకపోయిందని లోక్ సత్తా జాతీయ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. దేశ రాజకీయాల్లో పెను మార్పు రావాలనే ఆశతోనే ప్రజలంతా మోదీకి మద్దతు పలికారని... అయితే, ప్రజల అభిమతానికి అనుగుణంగా బీజేపీ నడుచుకోలేకపోయిందని అన్నారు. దీని ఫలితమే ఇప్పడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని చెప్పారు. ఢిల్లీ ప్రజలు చాలా తెలివిగా, విజ్ఞతతో ఓట్లు వేశారని... కులమతాలను చూసి ఓట్లు వేయలేదని అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై జేపీ దుమ్మెత్తి పోశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమైనట్టే అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఆ పార్టీ కోలుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా ఆప్ కే ఓటు వేశారని చెప్పారు. వారసత్వ చట్రంలో కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. రాజకీయాలు వ్యాపారం కావడం ప్రజలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అయితే, దేశంలోని పరిపాలనా వ్యవహారాలకు, ఢిల్లీలోని వ్యవహారాలకు చాలా తేడా ఉంటుందని జేపీ స్పష్టం చేశారు. ప్రజలు కొత్త రాజకీయం కోరుకుంటున్నారనడానికి ఢిల్లీలో వెలువడుతున్న ఫలితాలే నిదర్శనమని చెప్పారు.