: బెజవాడలో పట్టుబడ్డ హైదరాబాదీ... అతడికి టాటా, అంబానీలే ఆదర్శమట!
అతనిది ఉన్నత విద్యావంతుల కుటుంబం. తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. అన్న సైంటిస్ట్. తమ్ముడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇలాంటి మంచి కుటుంబం నుంచి వచ్చిన హైదరాబాదు యువకుడు నడింపల్లి వినయ్ కుమార్ కూడా ఎంబీఏ చేశాడు. ఎల్లో పేజెస్, సత్యం, ఇన్ఫోసిస్ తదితర కంపెనీల్లో టీమ్ లీడర్ గా మంచి పోజిషన్ లోనే ఉద్యోగం చేశాడు. దేశ పారిశ్రామిక రంగం రూపురేఖలు మార్చేసిన టాటా, అంబానీలను ఆదర్శంగా తీసుకుని మంచి వేతనం ఇస్తున్న ఉద్యోగాలను వదిలేశాడు. చతుర్ వ్యూహా ఇన్పోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కాల్ సెంటర్ ను స్థాపించాడు. ఓ చెన్నై కంపెనీ చూపిన ఆశతో 30 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. రూ.25 లక్షలు వసూలు చేసుకున్న చెన్నై కంపెనీ ప్రాజెక్టు ఇవ్వకుండా ఉడాయించడంతో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాడు. పెరిగిన అప్పులు, రుణదాతల ఒత్తిళ్ల నేపథ్యంలో విజయవాడ చేరుకున్నాడు. బయటపడటమెలా? అని ఆలోచించగా చోరీలే మార్గంగా కనిపించాయి. విజయవాడ, రాజమండ్రిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసుల చేతికి చిక్కాడు. రూ.20 లక్షల విలువ చేసే కార్లు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా, అంబానీల ఎత్తుకు ఎదగాలన్న తన ఆశయమే తనను దొంగగా చేసిందని అతడు బెజవాడ పోలీసుల వద్ద బావురుమన్నాడు.