: తలకు నల్లరంగు, రేబాన్ అద్దాలు... పొన్నాల వ్యక్తిగత విషయాలపై కడియం తీవ్ర కామెంట్స్
రాజకీయ నేతలు విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ప్రజలు గమనిస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా ఏకంగా వ్యక్తిగత అంశాలను కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్ర గురించి మాట్లాడుతూ, వ్యాన్ కోటు, రేబాన్ అద్దాలు, తలకు నల్లరంగు వేసుకుని మీడియాకు పోజులివ్వడానికే పాదయాత్ర చేసినట్టుందని కడియం విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు. తలకు నల్లరంగు వేసుకున్న రాజకీయ నేతలు టీఆర్ఎస్ లో ఎవరూ లేరని కడియం అనుకుంటున్నారా? అని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. అంతెందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జుట్టుకు నల్లరంగు వేసుకోవడం లేదా? అని కూడా గుసగుసలు పోతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గూగుల్ ఇమేజెస్ లో వెతికితే బ్రాండెడ్ నల్లకళ్లజోడు పెట్టుకున్న కేసీఆర్ ఫొటో కనపడుతుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగపడే విమర్శలు చేస్తే ప్రజలు హర్షిస్తారు కాని, ఇలాంటి పనికిమాలిన వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ప్రజలు ఛీ కొడతారని మండిపడుతున్నారు.