: బద్రి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి...విషాదంలో టీవీ9, మీడియా
టీవీ9 న్యూస్ యాంకర్ బద్రి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం బద్రి భౌతికకాయానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత మృతదేహాన్ని విజయవాడకు తరలించారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితుల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద మృతదేహాన్ని ఉంచనున్నారు. రేపు ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రమాదంలో గాయపడిన బద్రి భార్య లక్ష్మీసుజాత, పెద్ద కొడుకు సాయిదీపక్ పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్ పై వైద్యసేవలు అందిస్తున్నారు. కాగా, బద్రి బావమరిది గండ్రోతు తారక్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బద్రి మృతికి మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. మంచి మనిషిగా మన్ననలందుకున్న బద్రి మరణంపై అన్ని వర్గాల నుంచి స్పందన లభిస్తోంది. కాగా, బద్రి పార్థివదేహానికి టీవీ9 రవిప్రకాశ్, రజనీకాంత్ తదితరులు నివాళులర్పించారు.