: టీమిండియా పేలవ ప్రదర్శన...50 ఓవర్లు ఆడలేకపోయిన ఆటగాళ్లు
టీమిండియా పేలవ ప్రదర్శన దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన నాటి నుంచి టీమిండియా పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. టాపార్డర్ లో కీలక ఆటగాళ్లు విఫలమవ్వడం, రాణించిన ఆటగాళ్లు సాధించిన స్కోర్లను భారీస్కోర్లుగా మలచడంలో విఫలమవ్వడంతో టీమిండియా ఎప్పట్లానే చతికిల పడింది. అడిలైడ్ లో ప్రపంచకప్ సన్నాహక మ్యాచుల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు కనీసం 50 ఓవర్లు కూడా ఆడలేకపోవడం విశేషం. 371 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వికెట్లు కోల్పోయింది. దీంతో ధావన్ (59), రహానే (66) టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీలు సాధించిన వీరిద్దరూ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. తరువాత రైనా, ధోనీ, బిన్నీ, అక్షరపటేల్, అశ్విన్, జడేజా విఫలం కాగా, రాయుడు అర్ధసెంచరీలో మెరిశాడు. దీంతో టీమిండియా కేవలం 45.1 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 106 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా గ్లెన్ మాక్స్ వెల్ నిలిచాడు.