: హైదరాబాదు టూ విజయవాడ... వయా నల్లగొండ, మిర్యాలగూడ: మూడు రోజుల పాటు ఇదే మార్గం
హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లాలంటే నల్లగొండ, మిర్యాలగూడలను తాకాల్సిన అవసరం లేకుండానే నేరుగా జాతీయ రహదారిపై వేగంగా వెళ్లొచ్చుగా. మరి నల్లగొండ, మిర్యాలగూడలకు ఎందుకనుకుంటున్నారా? నేటి రాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ మార్గంలోనే ప్రయాణించాలి. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు జాతీయ రహదారిని మూసేస్తున్నారు. నార్కట్ పల్లి నుంచి ట్రాఫిక్ ను మళ్లించనున్న పోలీసులు నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడల మీదుగా వాహనాలను పంపిస్తారు. విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చే వాహనాలను కూడా పోలీసులు ఇదే మార్గం మీదుగా మళ్లిస్తారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట శివారులో ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే లింగమంతుల స్వామి (గొల్లగట్టు) జాతర నేటి రాత్రి ప్రారంభం కానుంది. జాతీయ రహదారికి అతి సమీపంలో జరిగే ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్ ను మూడు రోజుల పాటు మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు.